: ఈ సంగీతం 'షాక్' కొడుతుంది సుమా!
పాప్ మ్యూజిక్ లో ఏదో మత్తు వుంటుంది. మనిషిని పట్టుకుని ఊపేసే మ్యాజిక్ అందులో వుంటుంది. అందుకే, పాప్ సంగీతాన్ని ఆస్వాదించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వున్నారు. ఇప్పుడీ సంగీతానికి మరో శక్తి కూడా ఉందంటున్నారు. ఈ పాప్ సంగీతంతో కరెంటును ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంటే అధిక శబ్ధంతో వచ్చే సంగీతం వల్ల ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
క్వీన్‌మేరీ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్‌కి చెందిన శాస్త్రవేత్తలు సౌర విద్యుత్తు ఉత్పత్తిని ద్విగుణీకృతం చేసే లక్ష్యంతో పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనల్లో రోడ్డుపై వెళుతున్నప్పుడు వినపడే రణగొణధ్వనులకు సమానమైన శబ్దాలకూ, స్వరస్థాయికి సౌరవిద్యుత్ ఘటాలు మరింత సమర్ధవంతంగా పనిచేసి అధిక విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టు తేలింది. జింక్ ఆక్సైడ్తో తయారైన వస్తువులు ఒత్తిడికి గురైనప్పుడు అధిక విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది అనే ఫైజో ఎలక్ట్రిక్ సిద్ధాంతం ఆధారంగా వీరు పరిశోధన సాగించారు.
జింక్ ఆక్సైడ్ సూక్ష్మ గొట్టాలను తయారుచేసి, కొత్త నమూనాను రూపొందించారు. శబ్దాల ప్రకంపనలకు ఇవి స్పందించడం ద్వారా మామూలుకన్నా 40 శాతం ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి అయినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ కొత్త నమూనా ఏసీ కార్లు, ఇతర వాహనాల్లో సంగీతం వింటూ ప్రయాణించే వారికి చాలా ఉపయోగపడుతుందని, దీనికి పెద్ద ఖర్చు కూడా ఉండదని పరిశోధకులు చెబుతున్నారు.