: బస్తర్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదం
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్ సందర్భంగా నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం వల్ల రెండు పార్టీల కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బీజేపీ వర్గీయుల వాహనంలో మద్యం ఉందని సమాచారం ఉన్నందునే ఆపడం జరిగిందనీ, అక్కడే వివాదం తలెత్తిందని పోలీసులు చెబుతున్నారు. అనుకున్నట్టుగానే బీజేపీ వాహనంలో మద్యం దొరికింది. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన సునీల్ బఫ్నాతో పోలీసులు చర్చిస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్యామూ కశ్యప్ అక్కడికి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ గొడవలో కశ్యప్, అతని సన్నిహితులకు గాయాలయ్యాయని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.