: మనుగడ యోగ్యమైన రాష్ట్రాల్లో ఐదోస్థానంలో ఆంధ్రప్రదేశ్.. వినోదంలో కృష్ణా జిల్లా ఫస్ట్!
ప్రజలు మనుగడ సాగించడానికి యోగ్యమైన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఐదోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా తొలి నాలుగు స్థానాలను అలంకరించాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఈశాన్య రాష్ట్రాలు మహిళల మనుగడకు భద్రమైన నెలవుగా జాబితాకెక్కాయి. కాగా, వినోదం కోసం అత్యధికంగా ఖర్చు చేసే ప్రాంతాల్లో మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవడం విశేషమే.
టాటా స్ట్రాటజిక్ మేనేజ్ మెంట్ గ్రూప్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాగా, మనుగడ యోగ్యమైన రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్ ఘడ్, అసోం, జార్ఖండ్, బీహార్ చివరి వరుసలో నిలిచాయి. మహిళల భద్రత పరంగా చూస్తే మెట్రో నగరాల్లో ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు జాబితాలో చివరి స్థానాల్లో ఉన్నాయి.
ఈ జాబితాలో చెన్నయ్, బెంగళూరు సురక్షిత నగరాలుగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఇల్లు, వంట గది ఏర్పాట్లు, పరిశుభ్రత, వినోదం, కమ్యూనికేషన్, రవాణా, విద్య, ఆరోగ్యం వంటి విషయాలను ప్రాతిపదికగా మనుగడ యోగ్యమైన రాష్ట్రాలను వర్గీకరించారు.