: జుట్టు ఊడినా మళ్లీ పెంచవచ్చు
జుట్టు ఊడిపోతోందని చాలామంది బాధపడుతుంటారు. కొందరికి బట్టతల కూడా వచ్చేస్తుందేమోనని తెగ భయపడిపోతారు కూడా. ఇలాంటి వారికి మాత్రం ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే ఊడిపోయిన జుట్టును మళ్లీ పెరిగేలా చేయడానికి శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. ఈ విధానం ద్వారా ఊడిన జుట్టును పెరిగేలా చేయడమేకాదు... ఎముకలు, చర్మం, ఇతర సున్నితమైన కణాలు దెబ్బతిన్నా కూడా వాటిని తిరిగి పెరిగేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బోస్టన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు ఊడిన జుట్టును, దెబ్బతిన్న మృదులాస్థిని, ఎముకలను, చర్మాన్ని, ఇతర సున్నితమైన కణాలను కూడా బాగా పెరిగేలా చేయవచ్చని చెబుతున్నారు. ఈ దిశగా ఎలుకలపై నిర్వహించిన పరిశోధనలు విజయవంతమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని లిన్28-ఎ అనే జన్యువును పునరుత్తేజ పరచడం ద్వారా దెబ్బతిన్న కణాలను తిరిగి పెరిగేలా చేయవచ్చని తాము ఈ పరిశోధనల్లో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జన్యువును ఉత్తేజపరచడం ద్వారా దెబ్బతిన్న కణాల మాతృకణాలను తిరిగి శక్తిమంతం చేయవచ్చని, మైటోకాండ్రియాలో మెటబాలిజంను పెంచడం ద్వారా ఈ ఫలితాలను సాధించినట్టు పరిశోధకులు వివరించారు.