: న్యూటన్ సూత్రంలో లోపాలున్నాయి!
ఇప్పటి వరకూ న్యూటన్ మూడు గమన సూత్రాలను కనుగొన్నాడని పదవ తరగతి వరకూ చదివిన ఏ విద్యార్ధికైనా తెలిసివుంటుంది. అయితే ఇందులో రెండవ సూత్రాన్ని న్యూటన్ కనుగొనలేదని భారతదేశానికి చెందిన పరిశోధకుడు చెబుతున్నారు. ద్రవ్యరాశి, వేగానికి సంబంధించిన న్యూటన్ రెండవ గమన సూత్రాన్ని నిజానికి న్యూటన్ కనుగొనలేదని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన అజయ్ శర్మ అనే భారతీయ పరిశోధకుడు వెల్లడించారు. న్యూటన్ 1686లో రచించిన ప్రిన్సిపా అనే పుస్తకాన్ని నిశితంగా అధ్యయనం చేయగా ఎఫ్‌ఎంఏను కనుగొన్నవారు ఎవరో తెలియదన్న విషయం స్పష్టమైందని శర్మ తాను రాసిన 'బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్' అనే గ్రంధంలో పేర్కొన్నారు.
న్యూటన్ ప్రతిపాదించినట్టుగా చెప్పుకొంటున్న రెండవ సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరో స్పష్టంగా తెలియలేదని, కానీ భవిష్యత్తు తరాలవారికి వాస్తవాలను చెప్సాల్సిన అవసరం ఉన్నందున ప్రపంచంలోని 220 దేశాల పాఠ్యపుస్తకాల్లోను మార్పులు చేయాలని శర్మ సూచించారు. ఈ రెండవ సూత్రంలో లోపాలున్నాయని శర్మ తన పుస్తకంలో వివరణనిచ్చారు. ఒక కుర్రాడు రబ్బరు బంతిని, గుడ్డ బంతిని 2న్యూటన్‌ల బలంతో గోడకు కొట్టినప్పుడు రబ్బరు బంతి పది మీటర్లు వెనక్కి వస్తే గుడ్డబంతి ఐదు మీటర్లు మాత్రమే వెనక్కి వస్తుందని న్యూటన్ పేర్కొన్నారని, అందువల్ల చర్యకు ప్రతిచర్య ఉన్నా అన్నిసార్లూ రెండూ సమానంగా ఉండాల్సిన అవసరం లేదని శర్మ వివరించారు. శర్మ 31 సంవత్సరాలుగా ప్రాథమిక సూత్రాలపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఈయన రాసిన 'బియాండ్ న్యూటన్ అండ్ ఆర్కిమెడిస్'పుస్తకాన్ని నిపుణులు ఏడు నెలల పాటు పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాకే కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ సైన్స్ పబ్లిషింగ్ సంస్థ అక్టోబరు 28న ఈ పుస్తకాన్ని ప్రచురించింది.