: ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ యూటీ కాదు: జైపాల్ రెడ్డి


విభజన ప్రక్రియలో రాజధాని హైదరాబాద్ పై వస్తున్న వదంతులు, ఊహాగానాలకు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తెరదించే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ ప్రకటన చేసిన అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైత్రయాత్ర సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు వరంగల్ లో నిర్వహించిన సభలో జైపాల్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ రథ చక్రాలు కదిలాయని, ఉద్యమాల ఫలితాలు అనుభవించడానికి సంయమనం అవసరమని సూచించారు. దశాబ్దాలుగా దశలవారీ ఉద్యమ ఫలితమే ప్రత్యేక తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంత టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు సోనియాను విమర్శిస్తున్నారన్న జైపాల్ రెడ్డి... తెలంగాణ ఇస్తానని కాంగ్రెస్ చెప్పిందని ఆ తర్వాత ఇచ్చిందన్నారు. ఏదేమైనా సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని చెప్పారు. ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ మాట కాదని ఇందిరాగాంధీ హర్యానా ఇచ్చారని గుర్తు చేశారు. కీలక సమయంలో కొందరు సీమాంధ్ర నేతలు సైంధవ పాత్ర పోషిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News