: పటేల్ విగ్రహ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి తీసుకోని గుజరాత్ సర్కార్
ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మారకార్థం గుజరాత్ ప్రభుత్వం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి గతనెల చివర్లో బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, నరేంద్రమోడీ భూమి పూజ చేశారు. అయితే, గుజరాత్ ప్రభుత్వం ఈ భారీ విగ్రహ ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకోలేదట. కేంద్ర పర్యావరణ శాఖ క్లియరెన్స్ లేకుండా ఓ భారీ ప్రాజెక్టును చేపట్టడాన్ని దేశవ్యాప్తంగా ఉన్న కొందరు పర్యావరణ సంరక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అంటున్నారు. ఈ విషయంపై కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు కూడా దృష్టి సారించారు. దీనిపై ఎంక్వైరీ వేయడమో లేదా గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు పంపడమో చేయాలని భావిస్తున్నారు.
గుజరాత్ ప్రభుత్వం 182 మీటర్ల ఎత్తున్న పటేల్ విగ్రహాన్ని సర్ధార్ సరోవర్ డ్యామ్ దగ్గర్లో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. విగ్రహ ఏర్పాటుతో పాటు విజిటర్ సెంటర్, గార్డెన్, హోటల్, కన్వెన్షన్ సెంటర్, అమ్యూజ్ మెంట్ పార్క్, రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నిర్మాణానికి మొత్తం రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.