: రోహిత్ రికార్డుల మోత
రోహిత్ శర్మ వీరవిహారంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ చివరి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఇన్నింగ్స్ తో రోహిత్ శర్మ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. తిరుగులేని ఆటతీరుతో ఇన్నింగ్స్ చివరి వరకూ నిలిచిన రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు సచిన్, సెహ్వాగ్ లు మాత్రమే వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ నమోదు చేశారు. కేవలం 158 బంతుల్లో 209 పరుగులు సాధించాడు.
ఇందులో 12 ఫోర్లు, 16 సిక్స్ లు సాధించాడు. భారత్ తరుపును మూడో అత్యధిక పరుగుల రికార్డుతో పాటు, ఒక వన్డే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ ఆవిర్భవించాడు. భారత ఇన్నింగ్స్ లో ముప్పావు వంతు స్కోరు రోహిత్ సాధించినదే కావడం విశేషం. ఆసీస్ పై ఓ బ్యాట్స్ మన్ వ్యక్తిగతంగా సాధించిన అత్యధిక స్కోరు ఇదే. మరో వైపు చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడు కూడా రోహిత్ శర్మే కావడం విశేషం.
రోహిత్ శర్మ ఆటను చూడడానికి రెండు కళ్లూ చాలలేదు. అభిమానులకు రోహిత్ శర్మ పసందైన క్రికెట్ విందును అందించాడు. రోహిత్ ఆటతీరుకు మంత్ర ముగ్థులైన ప్రేక్షకులు అతను అవుటైనపుడు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. భారత క్రికెట్ జట్టు ఈలలు, కేరింతలతో రోహిత్ ను అభినందించింది. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కు ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్ తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కర్నీ ఇప్పుడు ఊపేస్తున్న పదం రోహిత్... కూడోస్ టూ రోహిత్!