: ఉస్మానియా అసుపత్రి వద్ద మీడియాపై దాడి
హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో వార్తల కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఉస్మానియా నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులు ఇద్దరు రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతికి గల కారణాలు ఆరా తీసేందుకు వెళ్లిన మీడియాకు అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతున్న పలువురు విద్యార్థినులు కనిపించారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్న మీడియాపై ఆసుపత్రి సిబ్బంది దాడికి యత్నించారు. కాగా నర్సింగ్ కళాశాల విద్యార్థినులు గత కొంత కాలంగా డెంగ్యూతో బాధపడుతున్నారని, తాము ఏడాదిగా పరిసరాలను శుభ్రం చేయాలని సూచిస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని విద్యార్థినులు ఆరోపించారు. పరిసరాల వల్లే తమకు అంటు వ్యాధులు వస్తున్నాయని, ఇద్దరు విద్యార్థినులు కూడా మృతి చెందారని వారు తెలిపారు.