: ఆలోచనల్ని బట్టి షూటింగ్ చేసే కెమెరా!
ఇదేమిటి పిచ్చిగా అనిపిస్తోందే అనుకుంటున్నారా? మీరేం అనుకున్నా ఇది నిజం. ఈ కెమెరా మీ మెదడులో సంచరించే ఆలోచనల్ని బట్టి.. తనకు తాను నిర్ణయం తీసుకుని తదనుగుణంగా వీడియోలు రికార్డు చేస్తుంది. మీరు చూస్తున్న వాటిలో మీకు ఏదైనా ఒక విషయం ఆసక్తికరంగా అనిపించినప్పుడు ఈ కెమెరా రికార్డింగ్ ప్రారంభిస్తుందిట. దీనిని ఎంచక్కా మీరు ధరించవచ్చు కూడా.
టోక్యో కేంద్రంగా పనిచేసే న్యూరోవేర్ కంపెనీ వారు అభివృద్ధి చేసిన ఈ న్యూరోకామ్ అనే కెమెరాలో.. దీనిని ధరించిన వారి మెదడులో జరిగే విద్యుత్తు చర్యను పసిగట్టగల సెన్సార్లు అమర్చి ఉంటాయని అంటున్నారు. ధరించిన వ్యక్తి చూస్తున్న విషయాలు అతనికి ఎంత ఆసక్తిదాయకంగా అనిపిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ మెదడులో విద్యుత్తు చర్యను బేరీజు వేయడానికి 1నుంచి 100 వరకు దశలను నిర్ణయించారు. 60 వ మార్కు దాటినా ఆసక్తిని కలిగించే దృశ్యాలు కనిపిస్తే.. ఆ కెమెరా.. లెన్స్ ఎదురుగా ఉన్న వాటిని జిఫ్ యానిమేషన్ ఫార్మాట్‌లో రికార్డు చేసి భద్రపరుస్తుందిట.