: పొగతాగడం వల్ల ఇలా కూడా నష్టమే!
పొగతాగడం వల్ల ఆరోగ్యం పాడయిపోతుందని ఒకవైపు నిపుణులు ఎంతగా చెబుతున్నా, మనవాళ్లు గుప్పు గుప్పుమంటూ పొగతాగడం మాత్రం మానలేకుండా ఉంటారు. ఇలాంటి వారికి ఇది కచ్చితంగా తెలియాల్సిందే. పొగతాగేవారి ముఖంలో వృద్ధాప్య ఛాయలు ముందుగానే వచ్చేస్తాయని తాజాగా జరిగిన అధ్యయనంలో తేలింది.
క్లీవ్‌లాండ్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో పొగతాగడం వల్ల కంటిపైన ఉండే కనురెప్పలు సాగినట్లు మారడం, ముడతలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా పొగతాగని కవలలు, పొగతాగే కవలల ముఖాలను వివిధ పద్ధతుల్లో నిపుణులు పోల్చిచూసినప్పుడు పొగతాగే కవలల ముఖంలో వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపించాయని ఈ పరిశోధనలో పాల్గొన్న బహమాన్ గుయురాన్ చెబుతున్నారు.