: పొద్దునే అయితే కచ్చితంగా నిజాలు చెబుతాం!
ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు అందరం చక్కగా నిజాయతీగా ఉంటాం. అలాగే పొద్దు ఎక్కేకొద్దీ మనలోని నిజాయతీ పాలు తగ్గుతుందట. అంటే ఉదయం పూట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో మనం ఎంతో నిజాయతీగా ఉంటామని, పొద్దెక్కేకొద్దీ మన నిజాయతీలో మార్పు వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆహ్లాదకరంగా ఉండే ఉదయపు పూట వాతావరణానికి మనుషుల్లో సంయమనం, మనసును నియంత్రించగలిగిన శక్తి కూడా అధికంగా ఉంటుందని, అందుకే అలాంటి సమయాల్లో అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం వంటివి జరిగే అవకాశాలు సాధారణంగా తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఉదయం పూట నిర్వహించిన అధ్యయనాల్లో కనపడిన నిజాయతీ తర్వాత కనిపించలేదని పేర్కొన్నారు. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఉదయం పూట మానసిక శక్తి, నిగ్రహం చాలా బలంగా ఉంటాయని, అదే పొద్దెక్కేకొద్దీ విశ్రాంతి లేకపోవడంతో పలు సందర్భాల్లో పదే పదే అదే నిర్ణయాన్ని తీసుకోవాల్సి రావడం వల్ల ఆలోచనలు గతితప్పి పక్కదారి పట్టే అవకాశం చాలా ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు.