: అతిగా ఉన్నా ప్రమాదమేనట!
ఏదైనా మితంగా ఉంటేనే మంచిది. అతిగా మారితే దానివల్ల ప్రయోజనాల సంగతి పక్కనపెట్టి అనర్థాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మన శరీరానికి కావలసిన పోషకాల విషయంలో కూడా ఇదే తీరు ఉంటుంది. మితమైన పరిమాణంలో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అదే మితిమీరితే దానివల్ల హాని కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శరీరానికి మేలుచేసే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చేపలు, వాల్‌నట్, పాలకూర వంటి వాటిలో ఎక్కువగా లభిస్తాయి. వీటిని తగు మోతాదులో తీసుకుంటేనే ప్రయోజనం చేకూరుతుందని, అతిగా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థలో మార్పులు సంభవించి సూక్ష్మజీవులతో పోరాడే సామర్ధ్యం తగ్గుతోందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. ఓరేగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నోర్మాన్ హోర్డ్ తాము నిర్వహించిన అధ్యయనంలో ఒమెగా-3 ఆమ్లాలతో కూడిన చేపనూనెతో సమృద్ధం చేసిన ఉత్పత్తులను తీసుకున్నప్పుడు ఆమ్లాల మోతాదు మరింత ఎక్కువై దాని ఫలితంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. అయితే ఆరోగ్యం కోసం చేపలు తినాలనే అమెరికా హార్ట్ అసోసియేషన్ సిఫారసులను తాము సమర్థిస్తామని హోర్డ్ చెబుతున్నారు. ఏదైనా మితంగా తీసుకుంటే అది ఔషధంలాగా పనిచేస్తుంది. అతిగా తీసుకుంటే అమృతమైనా విషమవుతుందికదా!