: హైదరాబాద్ టెస్టులో భారత్ ఘన విజయం.. మూడున్నర రోజుల్లో ఆసీస్ ఖేల్ ఖతం


హైదరాబాద్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ ను మూడున్నర రోజుల్లోనే మట్టికరిపించి సొంతగడ్డపై తాను ఇప్పటికీ బలీయమైన జట్టునే అని చాటింది. చెన్నైలో స్పిన్ కు దాసోహం అన్న కంగారూలు ఉప్పల్ మైదానంలో బెంబేలెత్తిపోయారు.

ఇన్నింగ్స్135 పరుగుల భారీ తేడాతో మ్యాచ్ ను ఆతిథ్య జట్టుకు అప్పగించారు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0 ఆధిక్యం సంపాదించింది. మూడో టెస్టు మార్చి 14 న మొహాలీలో మొదలవుతుంది. 

అంతకుముందు 74/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ను భారత స్పిన్నర్లు ఏ దశలోనూ కోలుకోనీయలేదు. జడేజా, అశ్విన్ పోటాపోటీగా వికెట్లు తీస్తూ ఆసీస్ పతనాన్ని శాసించారు.

నిలకడకు మారుపేరైన కెప్టెన్ క్లార్క్ (16) జడేజా బంతికి బౌల్డవడంతోనే ఆసీస్ ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ అలా వచ్చి ఇలా వెనుదిరిగారు. దీంతో భారత్ పని నల్లేరుపై నడకే అయింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ను 237/9 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 503 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. 266 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారూలు చివరికి 131 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించారు. కాగా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు డబుల్ సెంచరీ హీరో పుజారా చేజిక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News