: తెలుగు జాతికి అన్యాయం చేస్తే ఖబడ్దార్: చంద్రబాబు
'తెలుగు జాతికి అన్యాయం చేస్తే ఖబడ్దార్' అంటూ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. పశ్చిమగోదావరి జిల్లా నందమూరులో వరదబాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే వారి గుండెల్లో నిద్రపోతానని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తప్పుడుదారుల్లో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని బాబు ఆరోపించారు. టీఆర్ఎస్ తో కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుందని దుయ్యబట్టారు.
హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని, అభివృద్ధి తనకోసం చేసుకోలేదని, యువకుల భవిష్యత్ కోసమే అని స్పష్టం చేశారు. ప్రజలంతా ఆదాయం పొందేందుకు పలు పథకాలు పెట్టి ప్రోత్సహించిన ఘనత తమదేనన్నారు. ప్రజలు తప్పుడు నేతల విషయంలో కాస్త ఆలోచించాలని సూచించారు. హైదరాబాదులో ఆదాయం పెరిగితే దాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. రెండు ప్రాంతాల ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆయన కోరారు.