: దొంగ టీచర్ కు గ్రామస్తుల గుణపాఠం
విద్యార్ధులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయురాలు తప్పుడు ఆలోచనలతో విద్యార్థులను తప్పుడు మార్గాలు తొక్కమని ప్రోత్సహిస్తోంది. దీంతో, ఆమెకు గ్రామస్తులు గుణపాఠం చెప్పారు. గుంతకల్లు మండలంలోని అయ్యవారిపల్లిలో షమీంబీ టీచర్ గా పని చేస్తోంది. స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు 64 కళల్లోనూ ప్రవేశం ఉండాలనుకుందో, ఏమో కానీ చోర కళను కూడా నేర్పిస్తోంది. దీంతో మొదటికే మోసమొచ్చింది.
ప్రతి రోజూ రూపాయి, రెండు రూపాయలు కొనుగోలు చేసే మహాలక్ష్మి దగ్గర పది రూపాయల నోట్లు ఉండే సరికి దుకాణదారు బాలిక తండ్రికి విషయం చెప్పాడు. అతను కుమార్తెను నిలదీయడంతో బాలిక తండ్రి జేబులో డబ్బు తీసుకెళ్లి టీచర్ కి ఇచ్చినట్టు, టీచర్ ప్రోత్సాహం అంతా పూస గుచ్చినట్టు చెప్పింది. దీంతో, ఆ తండ్రి కుమార్తెకు సంతకం చేసిన 500 నోటు ఇచ్చి పంపారు. విషయం తెలియని టీచర్ అలవాటు ప్రకారం ఎవరెవరు ఏమేం తీసుకొచ్చారంటూ ఆరాతీసింది.
దీంతో, మహలక్ష్మి తను తెచ్చిన 500 రూపాయలను చూపడంతో ఆ డబ్బులు తన పర్సులో వేసుకుంది. అంతలో బాలిక తల్లిదండ్రులు ఊరి వాళ్లతో కలిసి పాఠశాలకు వెళ్లి టీచర్ ను నిలదీయడంతో తొలుత బుకాయించింది. అయితే, వారు ఆమె పర్సులోని 500 రూపాయల నోటు గురించి అడగగా, అది దారిలో దొరికిందని చెప్పింది. దీంతో, ప్రధానోపాధ్యాయుడికి, ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే టీచర్ షమీంబీపై చర్యతీసుకుంటామని ఆయన తెలిపారు.