: జగన్ ఆనాడే సమైక్యవాదినని చాటుకున్నారు: పిల్లి సుభాష్ చంద్రబోస్
పార్లమెంటులో ప్లకార్డు పట్టుకుని తాను సమైక్యవాదినని జగన్ ఆనాడే చాటిచెప్పారని వైఎస్సార్సీపీ నేత పిల్లి సుభోష్ చంద్రబోస్ తెలిపారు. సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర విభజన జరగాలంటే ఎన్నో అంశాలు పరిశీలిస్తారని చెప్పారు. విభజన అనంతరం ఆయా ప్రాంతాలు నిలదొక్కుకుంటాయో లేదో చూడాలని, అలాంటి ప్రయత్నం ఏదీ జరుగకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి, తన కుమారుడికి ప్రధాని పట్టం కట్టాలనే స్వార్థంతో సోనియా నిరంకుశ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసింది సోనియా అయితే, దానికి కత్తి అందించింది చంద్రబాబు నాయుడని అన్నారు.
సమన్యాయం అంటూ కొత్త కబుర్లు చెబుతున్న చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలోకానీ, దీక్షల్లో కానీ సమైక్యాంధ్రకు మద్దతుగా ఒక్క నినాదం చేయలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు రాజశేఖరరెడ్డి తెలంగాణకు అంగీకరించారని అంటున్నారని మండిపడ్డారు. ఒకవేళ రాజశేఖరరెడ్డి విభజించమన్నారని సాక్ష్యాన్ని చూపిస్తే వైఎస్సార్సీపీ విలీనానికి కూడా వెనుకాడబోమని ఆయన సవాలు విసిరారు.
చనిపోయిన వ్యక్తుల మీద అవాకులు చవాకులు పేలడం సరికాదని ఆయన హితవు పలికారు. ఏఐసీసీ నిర్ణయం శిలాశాసనం అంటున్నారని ప్రజాస్వామ్యంలో శిలాశాసనాలు ఉండవని అన్నారు. ఇక్కడి ప్రజలను, విద్యార్థులను, ఉద్యోగులను, వ్యవసాయదారులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సమైక్యంగా ఉంచకుంటే రాజశేఖర్ రెడ్డి పథకాలు ఎలా కొనసాగుతాయని ఆయన ప్రశ్నించారు.