: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చేరిన నాలుగో సీ-17 ఎయిర్ క్రాఫ్ట్
నాలుగవ సీ-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చేరింది. ఈ అతిపెద్ద రవాణా విమానాన్ని ప్రముఖ సంస్థ బోయింగ్ తయారుచేసింది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సీ-17 విమానాలను బోయింగ్ భారత వాయుసేనకు అందజేసింది. తాజా విమానం నాలుగవది. ఈ సంవత్సరం చివరికల్లా మరో విమానాన్ని మన వాయుసేనకు అప్పగించనుంది. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఐదు విమానాలు, వచ్చే ఏడాది మరో ఐదు విమానాలు మన వాయుసేనకు బోయింగ్ అప్పగించాలి. మొత్తం పది సీ-17 రవాణా విమానాలు మనకు చేరితే... అమెరికా వెలుపల సీ-17 విమానాలు అత్యధికంగా ఉన్న దేశంగా భారత్ నిలుస్తుంది.
భారీగా సేనలను, సరకులను తరలించడానికి ఈ విమానం ఉపయోగపడుతుంది. ఇటీవల ఫైలిన్ తుపాను విరుచుకుపడిన సమయంలో కూడా సీ-17 విమానాలను ఉపయోగించారు. ఇప్పటివరకు బోయింగ్ 258 సీ-17 విమానాలను తయారుచేసింది. వీటిలో 223 విమానాలు అమెరికా వాయుసేన దగ్గర ఉన్నాయి.