: హైదరాబాదునూ ముంచెత్తుతున్న వర్షాలు
మూడు రోజులుగా ఉత్తరాంధ్రను కుదిపేస్తున్న వర్షాలు గత రెండు రోజులుగా హైదరాబాదునూ ముంచెత్తాయి. వర్షాలతో హైదరాబాదులో మూసీ నది పొంగి పొర్లుతోంది. హుస్సేన్ సాగర్ నిండుకుండలా కనబడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నగరం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
కాగా, ఉత్తరాంధ్ర భారీ వర్షాలతో అతలాకుతలమైంది. లక్షలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. రోడ్లు, రహదారులు కొట్టుకుపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాగులు పొంగిపొర్లి రోడ్లపై ప్రవహిస్తూ కాజ్ వేలు కొట్టుకుపోవడంతో జాతీయ రహదారులపై వాహనాలు గత రెండు రోజులుగా నిలిచిపోయాయి.