: ఎయిడ్స్‌ను వేగంగా గుర్తించవచ్చట
ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు కనీసం రెండు వారాల సమయం పడుతుంది. పైగా ఎక్కువ వ్యయంతో కూడినది. అలాకాకుండా ఒక గంటకే ఎయిడ్స్ వ్యాధి ఉందా? లేదా? అనే విషయాన్ని తక్కువ ఖర్చుతో చెప్పేసే సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
అమెరికాలోని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త నేతృత్వం వహిస్తున్న నానో టెక్నాలజీ సంస్థ తక్కువ ఖర్చుతో గంటలోనే ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారించే పరికరాన్ని, యాప్‌ను రూపొందించింది. రక్తం, లాలాజలం లేదా శరీరంలోని ఇతర ద్రవపదార్ధాలను ఒక్క బొట్టు తీసుకుని నానోచిప్‌పై వేసి, 'జీన్-రీడర్'గా పిలిచే ఈ పరికరంలో పెడితే చాలు. ఎయిడ్స్ వ్యాధి ఉందో లేదో ఇట్టే తెలిసిపోతుందట. డాక్టర్ అనితాగోయెల్ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరిస్తున్న బోస్టన్‌లోని 'నానోబయోసిమ్' సంస్థ ఈ పరికరాన్ని రూపొందించింది. తమ పరికరం గోల్డ్ స్టాండర్డ్ పరీక్షను నిర్వహిస్తుందని, అమెరికాలో ఈ పరీక్షకు కనీసం రెండు వారాలు సమయం పట్టడమే కాకుండా వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుందని, జీన్-రీడర్ పరికరంతో చేపట్టే పరీక్ష తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని అనిత చెబుతున్నారు.