: సరిహద్దుల్లో 50 చోట్ల పాక్ కాల్పులు.. జవాను మృతి
పాక్ సైన్యం భారత్ తో యుద్ధాన్ని కోరుకుంటోందా? భారీ ఎత్తున ఉగ్రవాదులను భారత్ లోకి ప్రవేశపెట్టాలనే వ్యూహంతో ముందుకు కదులుతోందా? జమ్మూకాశ్మీర్లోని సరిహద్దుల్లో పాక్ సైనికులు భారత భద్రతా దళాల పోస్టులు, గ్రామాలపై పదే పదే కాల్పులకు దిగుతూ ఉండడం ఈ అనుమానాలు కలిగిస్తోంది. ముఖ్యంగా నవాజ్ షరీఫ్ పాక్ ప్రధాని పీఠంపై కూర్చున్నప్పటి నుంచి సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు పెరిగాయి.
గతరాత్రి నుంచి పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వెంబడి అంతర్జాతీయ సరిహద్దులలో ఆరు సెక్టార్లలోని మొత్తం 50 ప్రాంతాలలో పెద్ద ఎత్తున కాల్పులు ప్రారంభించారు. ఆర్ఎస్ పురా, పర్గావాల్ సెక్టార్లలో కాల్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక బీఎస్ఎఫ్ జవాను మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. పాక్ రేంజర్లు మోర్టార్లను, రాకెట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
వాస్తవానికి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయినా పాక్ సైనికులు దానికి తూట్లు పొడుస్తున్నారు. ఇరుదేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య ఫ్లాగ్ మీటింగులు జరుగుతున్నా కాల్పులకు మాత్రం తెరపడడం లేదు. నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడే భారత్, పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.