: మనిషికి, ఎలుకకు సారూప్యత ఉందట
మనిషికి సంబంధించి ఏదైనా వ్యాధిని నివారించేందుకు ఏదైనా కొత్త ఔషధాన్ని కనుగొంటే ముందుగా దాన్ని ఎలుకలపై ప్రయోగించి చూస్తారు. ఎందుకంటే ఎలుక కణజాలాలకు, మనిషి కణజాలాలకు దగ్గర పోలిక ఉంటుందనే ఉద్దేశ్యంతో ఎలుకలపై ప్రయోగిస్తారు. అలాగే ఏదైనా పొరబాట్లు చేసినప్పుడు కూడా మనిషి ఆలోచనలు, ఎలుకల ఆలోచనలు కూడా ఒకేవిధంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
మనుషులు ఏదైనా పొరబాట్లు చేసినప్పుడు, తాము చేసిన తప్పులనుండి గుణపాఠాలను నేర్చుకునే క్రమంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయో, ఎలుకల్లో కూడా ఆలోచనలు అలాగే ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తప్పులు చేసినప్పుడు మనుషుల్లో మెదడు తక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలను వెలువరిస్తుందని, ఎలుకల్లో కూడా ఇదే ధోరణి ఉన్నట్టు అయోవా, బ్రౌన్, యాలె విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. తాము కనుగొన్న విషయాలు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఏకాగ్రత లేమి, ఒత్తిడి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి మానసిక సమస్యల చికిత్సలో చక్కగా ఉపయోగపడతాయని ఈ అధ్యయనకర్తల్లో ఒకరైన జేమ్స్ కవానా చెబుతున్నారు. ఈ పరిశోధనా బృందానికి భారత సంతతికి చెందిన నందకుమార్ నారాయణన్ నేతృత్వం వహించారు.