: ఎన్ని వెరైటీలున్నా చీరకే మగువల తొలి ఓటు
మగువలు ధరించడానికి ఇప్పుడు మార్కెట్లో బోలెడు వెరైటీ దుస్తులు వచ్చినా... అప్పటినుండీ ఇప్పటి వరకూ మహిళలు ఎక్కువ మక్కువ చూపేది చీరకేనట. చీరకట్టులో ఉండే అందం అలాంటిది మరి. చక్కగా నాజూగ్గా కనిపించేలా చూపడంలో చీరది ఒక ప్రత్యేకమైన స్టైల్. అందుకే ఆధునికత ఎంత పెరిగినా మగువలు మాత్రం చీరను వదలకుండా ఉన్నారు. అలాగే మగవారితో పోల్చుకుంటే దుస్తులపై ఎక్కువగా ఖర్చుపెట్టేది మగువలేనట. ఒక తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. పెళ్లి లేదా ఫంక్షన్ ఇలా దేనికి వెళ్లాలన్నా ఏ డ్రస్ వేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని చాలాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకునేది ఎక్కువగా మహిళలే. అంతేకాదు మన ఇళ్లలోని బీరువాల్లో మగవారికన్నా ఎక్కువగా మగువల దుస్తులే ఎక్కువగా ఉంటాయట. అంటే భర్తలకన్నా భార్యలే ఎక్కువ బట్టలు కొంటుటారట. అంతేకాదు మార్కెట్లో కూడా ఆడవారికి సంబంధించిన బట్టలే ఎక్కువగా అమ్ముడవుతున్నాయని ప్రత్యేక అధ్యయనాలు తేల్చాయి.
ఇటీవలే చెప్పుల విషయంలో మగవారు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలాగే బట్టల విషయంలో మాత్రం ఆడవారు ఆధిక్యంలో ఉన్నారట. అమ్మాయిలు ధరించడానికి బోలెడన్ని ష్యాషన్ దుస్తులు మార్కెట్లోకి వస్తుంటాయి. దీంతో వాటిని కొనేందుకు మగువలు కూడా మక్కువ చూపుతారు. ఒకప్పుడు మహిళలకు పెద్దగా ఆర్ధిక పరమైన ఆదాయం ఉండేది కాదు. దీంతో ఇంట్లో వాళ్లు ఎప్పుడు బట్టలు కొంటే అప్పుడే వారికి కొత్త బట్టలు వచ్చేవి. కానీ ఇప్పుడు అలాకాదు... మహిళలు కూడా చక్కగా ఉద్యోగాలు చేస్తూ తమకంటూ స్వంత ఆదాయాన్ని కలిగివున్నారు. దీంతో నెలజీతం అందుకోగానే పండగ, వేడుక వంటివి ఏవీ లేకున్నా చక్కగా వేరేదైనా షాపింగ్‌కు వెళ్లినప్పుడు తమ మనసుకు నచ్చిన డ్రస్‌లు కనపడగానే వాటిని కొనేసుకుంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు.