: ప్రారంభంలోనే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు
ప్రపంచంలో మరణాలకు కారణమయ్యే రోగాల్లో రెండవ అతిపెద్ద వ్యాధిగా చెప్పుకోదగినది క్యాన్సర్. ఇది ప్రొస్టేట్, ఊపిరితిత్తులు... ఇలా శరీరంలోని పలు అవయవాలకు వచ్చే ప్రమాదముంది. అయితే క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ సమయంలో గుర్తించడం కష్టం. దీంతో వ్యాధి కొద్దిమేర తీవ్రరూపందాల్చిన తర్వాత వివిధ రకాల పరీక్షలద్వారా దాన్ని గుర్తించడం జరుగుతుంది. అలా కాకుండా తేలికపాటి రక్త పరీక్షతోనే రోగాన్ని ప్రారంభదశలోనే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రొస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్లను గుర్తించే తేలికైన రక్త పరీక్షను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రక్తపరీక్షలో రక్తంలోని కొవ్వు ఆమ్లాలు, వాటి జీవ సూచికల ఆధారంగా తొలిదశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు క్యాన్సర్ కణితిని తొలగించిన తర్వాత కూడా క్యాన్సర్ తిరిగి ఏర్పడడాన్ని కూడా ఈ రక్తపరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్షను గురించి ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్లెవ్‌లాండ్ క్లినిక్‌కు చెందిన జింబో లుయి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమయ్యే రెండవ అతిపెద్ద కారకంగా క్యాన్సర్ వ్యాధి పరిణమిస్తున్న నేపధ్యంలో దీన్ని గుర్తించడం పెద్ద సవాలుగా మిగిలిందని, తాము కనుగొన్న ఈ సరికొత్త రక్తపరీక్ష ద్వారా ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించవచ్చని చెబుతున్నారు. అంతేకాదు కణితి తొలగింపు శస్త్రచికిత్స ఎంతమేరకు విజయవంతం అయ్యింది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ రక్తపరీక్ష ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు.