: ఉద్యమం కొనసాగుతుంది: అశోక్ బాబు
ఉద్యమం కొనసాగుతుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రులు ప్రజలను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు న్యాయం చేయాలంటే ఉద్యమం కొనసాగించాలని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. రేపు జేఏసీ భేటీ అనంతరం భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేంద్రం నుంచి అయోమయ ప్రకటనలు వస్తున్నాయన్న అశోక్ బాబు, కొందరు నేతలు ఉద్యమం బలహీనపడేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎంపీలు తమ రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అడిగినప్పుడే రాజీనామాలు చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. రేపు ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం ఈ నెల 18న ఎమ్మెల్యేలను కలిసి హామీ ఇవ్వాలని కోరతామని వెల్లడించారు. అసెంబ్లీలో బిల్లు అభిప్రాయ సేకరణకు వస్తే వ్యతిరేకించాలని ఎమ్మెల్యేలను కోరుతామని అశోక్ బాబు చెప్పారు. అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత పార్లమెంటుపై ఉంటుందని ఆయన చెప్పారు.