: ఢిల్లీ కుర్చీ కమలానికా లేక హస్తానికా?
ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ 15 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఈసారి పరిస్థితులు బీజేపీకి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. కానీ, బీజేపీ ఓట్లకు గండికొట్టడానికి (ప్రభుత్వ వ్యతిరేక ఓటు) ఆమ్ ఆద్మీ రూపంలో ఒక పార్టీ రావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏసీ నీల్సన్ ఏబీపీ న్యూస్ కోసం ఢిల్లీ ఫలితాలపై సర్వే నిర్వహించింది. ఇందులో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనున్నట్లు తేలింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీకి 28 సీట్లు, కాంగ్రెస్ కు 22, ఆమ్ ఆద్మీ పార్టీకి 18 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరం. అయితే, ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం ఉండడంతో సీట్ల లెక్కలో తేడాలు రావచ్చు.
బీజేపీ మరిన్ని సీట్లను సాధిస్తే అధికారం ఆ పార్టీకే సొంతం అవుతుంది. కానీ, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చే ఓట్లపైనే బీజేపీ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషకుల మాట. షీలా దీక్షిత్ పాలనపై ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉండడంతో కాంగ్రెస్ కు సీట్లు మరిన్ని తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఓటింగ్ ఎక్కువగా నమోదైతే అధికారం బీజేపీనే వరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలను బీజేపీ పొందలేని స్థితి నెలకొంటే అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది. ఆ పార్టీ కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలు తక్కువ. ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వ అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కూడా. కనుక బీజేపీకే మద్దతిచ్చే అవకాశాలు ఉంటాయి. మరి సీఎం పీఠంపై కన్నేసిన కేజ్రీవాల్ ఆ కుర్చీని బీజేపీకి ఇస్తారో, తనకే ఇవ్వాలంటూ పట్టుపడతారో చూడాలి.