: ఆరోగ్యానికి నిద్రే ఔషధం
ప్రస్తుత నాగరిక ప్రపంచంలో యువత ఎక్కువగా పార్టీలనీ, విందులనీ తిరుగుతూ ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకోవడం, నిద్రపోవడం జరుగుతోంది. దీనివల్ల శరీరానికి అవసరమైన నిద్ర సమకూరదు. దీంతో నిద్రలేమి కారణంగా రకరకాల సమస్యలు ఏర్పడతాయి. రాత్రి సరిగా నిద్రలేకపోవడం వల్ల ఉదయాన్నే విపరీతమైన బద్దకం వేధిస్తుంది. మానసికంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీంతో పనిలో ఏకాగ్రత లోపిస్తుంది, ఫలితంగా పని సక్రమంగా చేయలేకపోతాం. కాబట్టి కంటినిండా నిద్రపోవడం ఎంతైనా అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా నిద్రలేమి వల్ల మతిమరుపు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మెదడు ఎదుగుదల లోపిస్తుందని, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, స్థూలకాయం, డయాబెటిస్, జీర్ణకోశ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి అనేక రకాల సమస్యలు నిద్రలేమి వల్లే వస్తాయట. అంటే నిద్రలేకపోవడం అనేది మన మొత్తం శరీరంలోని అన్ని రకాల వ్యవస్థలపైన ప్రభావం చూపుతుందన్నమాట. అంతేకాదు, సరిగా నిద్రపోకుంటే దాని ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా 80 శాతం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి చక్కటి ఆరోగ్యం కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేకుండా చక్కగా వేళకు నిద్రపోతూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.