: యువతకు సంపాదనే ముఖ్యం కాకూడదు: జస్టిస్ జాస్తి చలమేశ్వర్
యువతకు డబ్బు సంపాదనే ముఖ్యం కాకూడదని, వారు సమాజం పట్ల సేవా దృక్పథాన్ని కూడా పెంపొందించుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ కాసరనేని సదాశివరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య, విద్య, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో కాసరనేని చేసిన సేవలను కొనియాడారు. విగ్రహాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళుతూ సమాజానికి నిస్వార్థ సేవలు అందించిననాడే వారికి నిజమైన నివాళి సమర్పించినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.