: ప్రధాని, చిదంబరాన్ని రక్షించేలా జేపీసీ రిపోర్ట్: బీజేపీ
2జీ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్ధికమంత్రి పి.చిదంబరంపై ప్రధాన ప్రతిపక్షం బీజేపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ (జేపీసీ) ఈ స్కాంలో వారిద్దరితో కలిపి ప్రభుత్వాన్ని రక్షించేలా ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఓ అసమ్మతి నోట్ ను రూపొందించింది. ఢిల్లీలో నేడు బీజేపీ నేత యశ్వంత్ సిన్హా మీడియాకు ఈ నోట్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేపీసీ ఈ స్కాంను విచారణ చేసిన విధానంపై భవిష్యత్తులో కచ్చితంగా దర్యాప్తు కోరాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2జీ భాగోతం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, సుప్రీంకోర్టు జోక్యంతో స్పెక్ట్రమ్ లైసెన్సులు క్యాన్సిల్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఏప్రిల్ నెలలో నివేదించిన ఈ జేపీసీ రిపోర్టును పలు పార్టీలు వ్యతిరేకించాయి. కాగా, 2జీ స్కాంలో విచారణలు, వాదోపవాదాలు వినేందుకు సుప్రీంకోర్టులో కొత్త బెంచ్ ను చీఫ్ జస్టిస్ పి.సదాశివం ఏర్పాటుచేశారు.