: అవినీతి కూడా క్యాన్సర్ లాంటిదే: సుప్రీం కోర్టు
ప్రస్తుత సమాజంలో మిక్కిలిగా విస్తరించిన అవినీతి కూడా క్యాన్సర్ లాంటిదేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాన్ని ఆరంభంలోనే గుర్తించాలని లేకపోతే అది వ్యవస్థ మొత్తాన్ని కబళిస్తుందని సుప్రీం పేర్కొంది. గుజరాత్ లోకాయుక్తగా ఏ.ఆర్. మెహతా నియామకాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందిస్తూ.. తాజా వ్యాఖ్యలు చేసింది.
అవినీతి కారణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ యంత్రాంగాలు కుప్పకూలుతాయని, అందుకే ఆరంభంలోనే దాన్నినిర్మూలించాలని జస్టిస్ చౌహాన్, జస్టిస్ కలీఫుల్లాలతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. నైతిక విలువలు పతనం కావడంతో వ్యవస్థీకృత ఆర్ధిక నేరాలు, మనీలాండరింగ్, ఉగ్రవాదం వంటి తీవ్ర స్థాయి నేరాలు అధికమవుతాయని పేర్కొంది.