: అతిగా చేయకూడదు!
అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు చెబుతుంటారు. ఏ విషయాన్ని కూడా అతిగా చేయకూడదని. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. మారుతున్న కాలంతోబాటు అన్నీ మారుతూ వస్తున్నాయి. జీవనావసరాల వద్దనుండి మన రోజువారీ కార్యక్రమాల్లో బాగానే మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరిని చూసినా ఆన్లైన్ ఛాటింగులు, ఫేస్‌బుక్‌లు అంటూ ఎక్కువ సమయం నెట్టింట్లోనే గడుపుతున్నారు. కానీ ఇలా చేయడం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం నెట్లో గడిపేవారికి మెదడుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని, జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతూ ట్విట్టర్, ఫేస్బుక్, చాటింగ్ అంటూ కాలం గడిపేవారు ఇలా గడిపే తమ సమయాన్ని తగ్గించుకుంటే ఆరోగ్య పరంగా మంచిదంటున్నారు నిపుణులు. ఎక్కువ సమయం ఇలా ఆన్లైన్లో గడపడం వల్ల మన మెదడు వివిధ రకాల విషయాల గురించి ఆలోచిస్తూ, వివిధ రకాల విషయాలను గురించి వెదుకుతూ ఉంటుంది. దీనివల్ల మెదడుపై ఎక్కువ భారం పడుతుంది. నెట్లో చాలా విషయాలపై దృష్టి సారించడం వల్ల ఏకాగ్రత కుదరదనీ, ఇలాగే ఎక్కువరోజులు కొనసాగితే అది జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరాన్ని బట్టే కంప్యూటర్ ముందు కూర్చోవడం, నెట్లో గడపడం వంటివి చేయాలని, ఎక్కువ సమయం నెట్ ముందు గడపాల్సి వచ్చినా, మధ్య మధ్యలో కాస్త విరామం ఇస్తూవుండాలని, ఇలా చేస్తే కాస్తైనా మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.