: పిల్లలను ఆడుకోనిద్దాం


మన పిల్లలను చక్కగా ఆడుకోనిస్తున్నామా... ఒక్కసారి మనం చిన్న తనంలో ఎలా ఉండేవాళ్లమో గుర్తుచేసుకోండి. చక్కగా చుట్టుపక్కల ఉన్న మన ఈడు పిల్లలతో కలిసి ఆడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది. మనం మన పిల్లలకు ఆడుకునే అవకాశం ఇస్తున్నామా... ఒకవేళ ఇచ్చినా వారికి ఆడుకునేందుకు అనువైన స్థలం దొరకడంలేదు. దీంతో పిల్లలు ఎక్కువగా వీడియో గేమ్‌లు ఆడడం, టీవీలు చూడడం వంటి వాటికి పరిమితమవుతున్నారు. దీని కారణంగా పట్టణాల్లో ఉంటున్న పిల్లలు పలు రకాలైన సమస్యలతో సతమతమవుతున్నారని తాజా సర్వేలో తేలింది.

హైదరాబాద్‌, బెంగుళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాల్లో పెరిగే పిల్లల్లో ఎక్కువమంది వీడియోగేమ్‌లను ఆడడం, సెల్‌ఫోన్‌ గేమ్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలతోనే కాలం గడుపుతున్నారు. ఈ కారణంగా పిల్లల్లో నిద్రలేమి, ఒంటరితనం వంటి సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధకులు నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ పరిశోధకులు దేశంలోని పది ప్రధానమైన నగరాల్లోని సుమారు 2,500 మంది పిల్లలపై ప్రత్యేకమైన సర్వేను నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న పిల్లలంతా ఆన్‌లైన్‌ ఆటలను, టెక్నాలజీని ఎక్కువగా ఇష్టపడేవారే. వీరిలో ఎక్కువగా ఎలక్ట్రానిక్‌ వస్తువులను వాడే వారిలో 25 శాతం మంది నిద్రలేమి వంటి సమస్య బారిన పడినవారు కూడా ఉన్నారు. చక్కగా వీధుల్లో ఆడుకోవాల్సిన సమయంలో వారు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడం వల్ల శారీరక దృఢత్వం కూడా తగ్గిపోతుందని, కాబట్టి పిల్లలను చక్కగా ఆడుకోనివ్వాలని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఎంత దూరంగా ఉంచితే వారి ఆరోగ్యానికి అంత మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News