: భారత్ చేతిలో ఓడిపోతామన్న ఆలోచన వద్దు: కంగారూలకు హాడిన్ సూచన
టీమిండియాతో మరో ఐదు రోజుల్లో ప్రారంభమయ్యే భారీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్ బయలుదేరింది. ఇప్పటికే కెప్టెన్ క్లార్క్ గాయంతో జట్టుకు దూరమవడం, అంతకుముందు యాషెస్ సిరీస్ ను కోల్పోవడం లాంటి సమస్యలతో... ఆస్ట్రేలియా జట్టు ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో టీమిండియాలాంటి బలమైన జట్టుతో ఆడాల్సిరావడం ఆస్ట్రేలియాకు పెను సవాలే. అందుకే ఆసీస్ జట్టు ఇండియా బయలుదేరేముందు వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్... తోటి ఆటగాళ్లలో స్పూర్తి నింపే ప్రయత్నం చేశాడు. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ధోనీసేన చేతిలో ఓటమి పాలవుతామనే భావనను... మొదట మనసులోంచి తీసేయాలని సూచించాడు. అప్పుడు తమను ఓడించడం అంత సులువు కాబోదని సహచరులకు చెప్పాడు. భారత్ లో అడుగుపెట్టిన వెంటనే అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రయత్నించాలని హితబోధ చేశాడు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 2 వరకు జరిగే ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు ఒక టీ20తో పాటు 7 వన్డేలు ఆడబోతోంది.