: రాష్ట్రం సోనియా స్వంత జాగీరా?.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా?: చంద్రబాబు
'రాష్ట్రాన్ని తన ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఏమన్నా సోనియా స్వంత జాగీరా? లేక సోనియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా?' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నించారు. ఆయన నివాసంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ విధానాలను జాతీయ నేతలకు, దేశ ప్రజలకు వివరించి ఆ పార్టీ అంటే అసహ్యించుకునే స్థితికి తీసుకువస్తానని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ నాశనమై ఇతర పార్టీలను కూడా నాశనం చేసే స్థితికి తీసుకువచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ కుతంత్రాలను బయటపెడుతూ అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని స్ఫష్టం చేశారు.
స్క్రిప్టుల ప్రకారం జగన్ మాట్లాడుతున్నారని, అందుకే జగన్ కు సోనియా పేరు ఉచ్చరించేందుకు కూడా నోరు రావడం లేదని ఆయన అన్నారు. జగన్ గతంలో ఆర్టికల్ 3 ప్రకారం విభజన చేయవచ్చనే ప్రకటనల్ని మర్చిపోయినట్టున్నారని, అందుకే తమపై విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు విభజన నిర్ణయం తీసుకోవడంలోనే కాంగ్రెస్ దమన నీతి బయటపడుతోందని ఆయన అన్నారు.
'ప్రత్యేక కమిటీ జలవనరులపై నివేదిక సమర్పించనుంది. మరి కొద్ది రోజుల్లో ట్రిబ్యునల్ రిపోర్టు రావాల్సి ఉంది. మరో వైపు కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచారు. ఆ రిపోర్టు వచ్చాకే నీటి విభజన తేలాల్సి ఉంది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనలో నీటి కేటాయింపులు ఎలా జరుపుతారని' ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 45 రోజుల్లో విభజన జరుపుతామంటున్నారు. అది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీని రేపు అధికారంలోకి వచ్చే పార్టీ ఎలా అమలు చేస్తుందని, మీరిచ్చే హామీని ప్రజలు ఎలా ఒప్పుకుంటారని బాబు నిలదీశారు. విభజన ఎన్నికల ముందే ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడి తప్పుడు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.