: దిగ్విజయ్ ని సీబీఐ డైరెక్టర్ ఎందుకు కలిశారు?: బాబు
దిగ్విజయ్ సింగ్ ని సీబీఐ డైరెక్టర్ ఎందుకు కలిశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాట్లాడుతూ సీబీఐ రాజకీయాలకు అతీతంగా పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సీబీఐ డైరెక్టర్ స్థాయి వ్యక్తి వచ్చి కలవడానికి దిగ్విజయ్ ఏమన్నా సీబీఐ కి యజమానా? అని నిలదీశారు. పత్యర్థులను లొంగదీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సీబీఐని పావుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. దొంగలు, అవినీతి పరులకు సీబీఐ అండగా నిలబడుతోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ లతో ఒప్పందం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. జగన్ కేసులో సీబీఐ మెమో దాఖలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. సీబీఐని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బాబు మండిపడ్డారు. సీబీఐ కోర్టుముందు పెట్టే ఆధారాలన్నీ బలంగా ఉండాలని, అలాంటిది జగన్ విషయంలో ముందు బలంగా వ్యవహరించిన సీబీఐ తరువాత అసంబద్దంగా వ్యవహరించిందని అన్నారు. రాహుల్ గాంధీ వ్యవహారశైలి ప్రధానిని అవమాన పరిచేదిగా ఉందని ఆయన విమర్శించారు.
నేరపూరిత నేతలకు చట్టసభల్లో ప్రవేశానికి ఆర్డినెన్స్ ను ఎందుకు పెట్టారు? ఎందుకు వాపస్ తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దేశానికి ఏ సందేశం ఇస్తున్నారని ఆయన నిలదీశారు. దేశంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండడంతో దేశ భవిష్యత్తు కుప్పకూలిందని ఆరోపించారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, లక్ష్యం లేకపోవడంతో పాలకులు దేశానికి తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి అని తాము సూచిస్తే, అది చేయకుండా విభజనకు పాల్పడుతూ స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్డినెన్స్ నే వెనక్కి తీసుకున్నారని, అలాంటిది నిర్ణయం తీసుకోవడంలో వింతేముందని అంటూ పరోక్షంగా సీడబ్ల్యూసీ నిర్ణయంపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్ణయం వెనక్కి తీసుకునే అవకాశముందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఈ రోజుల్లో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని బాబు స్పష్టం చేశారు.