: సీడబ్ల్యూసీ తీర్మానంపై సీఎం వ్యాఖ్యలు బాధాకరం: జానారెడ్డి
విభజనపై సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని పునరాలోచించుకోవాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు విచారకరమని మంత్రి జానారెడ్డి అన్నారు. విభజన ప్రకటన అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని చెప్పారు. తెలంగాణలో పర్యటించిన ప్రతిసారీ అధిష్ఠానం నిర్ణయం శిరోధార్యమని సీఎం చెప్పారని, శాసనసభలో కూడా ప్రకటించారన్నారు. అలాంటప్పుడు ఇప్పుడిలా మాట్లాడటం సరికాదని సూచించారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి సీఎం సహా అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జానారెడ్డి.. నిన్న కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎందుకు వచ్చాయో అందరికీ తెలుసని, సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలే తప్ప.. అనుమానాలు కలిగేలా ప్రవర్తించొద్దని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఉన్న సమస్యను పరిష్కరించేందుకే విభజన అని.. జటిలం చేసేందుకు కాదని జానారెడ్డి పేర్కొన్నారు. అధిష్ఠానం నిర్ణయం కోసం చాలాకాలం తాము వేచి చూశామని చెప్పుకొచ్చారు.