: ఈ ఏడాది స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 261: కేంద్రం వెల్లడి
గత కొన్ని సంవత్సారాలుగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ప్రమాదకర స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా దేశంలో ఈ ఏడాది 261 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో అత్యధికులు రాజస్థాన్ వాసులేనని ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది.
ఈ ఏడాది దేశం మొత్తం మీద 2329 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు నిర్థారణ అయిందని, ఒక్క ఢిల్లీలోనే 834 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని ఆ నివేదిక పేర్కొంది. కాగా, రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ కారణంగా 107 మంది చనిపోయారు. హెచ్1ఎన్1 వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కారణంగా ఆసియా దేశాల్లో చాలామంది మరణించారు.
అయితే, 2009 నుంచి స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య భారత్ లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2009 లో 27,236.. 2010లో 20,604.. 2012లో 5054 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.