: డమ్మీ పిస్టల్ తో బ్యాంక్ చోరీకి పాల్పడ్డ స్కూలు విద్యార్థి


చూడ్డానికి పాలబుగ్గల కుర్రాడే. కానీ వీడియో గేమ్ తరహాలో బ్యాంక్ దోపిడీ చేశాడు. కరడుగట్టిన క్రిమినల్స్ స్టైల్ లో ఐదు నిమిషాల్లో పని ముగించాడు. యాక్షన్ సినిమాను తలపించే ఈ ఘటన ఇంగ్లండ్ లోని లివర్ పూల్ నగరంలోని బార్క్లేస్ బ్యాంక్ లో జరిగింది. 15 ఏళ్ల వయసున్న కుర్రాడు ముఖానికి గుడ్డ కట్టుకుని బ్యాంక్ లోకి ప్రవేశించగానే తన దగ్గరున్న డమ్మీ తుపాకిని బయటకు తీసి... వీడియో గేమ్ తరహాలో బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లపై గిరి పెట్టాడు. తాను ఐదేళ్ల పాటు జైలులో గడిపి ఇప్పుడే విడుదలయ్యానని, పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పడేస్తానని అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి తుపాకి ఎక్కుపెట్టి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో భయపడ్డ క్యాషియర్ ఆ కుర్రాడి చేతిలో రెండు వేల పౌండ్ల కరెన్సీ కట్టను ఉంచాడు. అంతే, ఆ కుర్రాడు క్షణాల్లో బ్యాంక్ నుంచి మాయమయ్యాడు.

అయితే కొడుకు వద్ద ఎప్పుడూ లేనిది అంత డబ్బు కనపడగానే ఆ కుర్రాడి తల్లికి డౌట్ వచ్చింది. వెంటనే పోలీసులకు తెలియజేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఆ కుర్రాడిని కోర్టు బోనులో నిలబెట్టారు. కేసును విచారించిన కోర్టు... తీవ్రంగా స్పందించింది. ఇది సామాన్యమైన విషయం కాదని అభిప్రాయపడింది. కుర్రాడు వాడింది డమ్మీ పిస్టల్ అయినప్పటికీ... ఈ కేసు ఆయుధాలతో చేసిన దొంగతనం కిందకే వస్తుందని తెలిపింది. రియల్ లైఫ్ యాక్షన్ వీడియో గేమ్ లో మాదిరి దొంగతనానికి పాల్పడ్డాడని వ్యాఖ్యానించింది. చేసిన నేరానికి కోర్టు అక్టోబర్ 15వ తేదీన శిక్షను ఖరారు చేయనుంది. అంతవరకు దొంగతనానికి పాల్పడ్డ కుర్రాడికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అయితే, ఈ కుర్రాడు చాలా మంచివాడని, మంచి కుటుంబం నుంచి వచ్చాడని, స్కూల్ లో కూడా మంచి రికార్డు ఉందని డిఫెన్స్ లాయర్ కోర్టుకు తెలియజేశాడు.

  • Loading...

More Telugu News