: మావోయిస్టులు మనవాళ్లే: సీఆర్పీఎఫ్ డీజీ
మావోయిస్టులతో మరింత మానవత్వంతో వ్యవహరించాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ దిలీప్ త్రివేది అభిప్రాయపడ్డారు. 'వాళ్లంతా కూడా మన వారే... బయట నుంచి వచ్చిన వారు కాదు' అని తెలిపారు. 'మనం భద్రతాదళాల మాదిరి విదేశీ శక్తులతో పోరాడటం లేదు... పోరాటం మన వారితోనే కాబట్టి మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరముంది' అని ఆయన అన్నారు. అయితే నక్సల్స్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. 1978 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన త్రివేది నెల రోజుల కిందనే సీఆర్పీఎఫ్ డీజీగా పదవీబాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఆయన మావోయిస్టుల సమస్య అధికంగా ఉన్న జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రస్తుతం మావోయిస్టుల సమస్య ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో 85 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు పనిచేస్తున్నారు.