: 'లావు' లెటర్లు పంపుతారట!
చిన్న పిల్లల్లో ఊబకాయం సమస్య కొంతమందిలో ఉంటుంది. అయితే అమెరికాలోని పాఠశాల విద్యార్ధుల్లో ఊబకాయం సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకు వారి పిల్లల ఊబకాయం గురించి తెలియజేయడానికి కొన్ని పాఠశాలలు ప్రత్యేక పద్ధతిని ఎన్నుకున్నాయి. సదరు పిల్లల తల్లిదండ్రులకు లావు లెటర్లు రాయడం ప్రారంభించారు.
మన దేశంలో పిల్లలు ఊబకాయులుగా తయారవుతుంటే పాఠశాలలు పెద్దగా పట్టించుకోవు. ఇక్కడంతా మార్కులే ధ్యేయంగా పిల్లలను చదివించడమే పరమావధిగా భావిస్తుంటారు. అయితే అమెరికాలోని పాఠశాలలు అక్కడ విద్యనభ్యసించే పిల్లల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధవహించడానికి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టాయి. అక్కడి పిల్లల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలా లావెక్కుతున్న పిల్లల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యాలు లేఖలు రాయడం ప్రారంభించాయి.
ఈ లేఖల్లో తల్లిదండ్రులు తమ పిల్లల ఊబకాయం సమస్యను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాయి. ఫ్యాట్ లెటర్స్‌గా వ్యవహరించే ఈ లేఖలవల్ల మంచి ఫలితాలు వస్తున్నాయట కూడా. ఈ సరికొత్త పద్ధతిని శాన్‌ఫ్రాన్సిస్కోలోని పోషకాహార నిపుణురాలు లారెన్ స్మిట్ శ్రీకారం చుట్టారు. పలు పాఠశాలలకు ఆమె రెండునుండి ఐదేళ్ల మధ్య వయసున్న పిల్లల ఎదుగుదల పట్టిను పరిశీలించారు. నిర్ణీతకాలంలో 95 శాతంకంటే ఎక్కువ ఎదుగుదల నమోదుచేసిన వారిని ఊబకాయులుగా గుర్తించారు. అలాంటి పిల్లల తల్లిదండ్రులకు వారి పిల్లలకు ఊబకాయం రాకుండా ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలాంటి వ్యాయామాలు చేయించాలి? వంటి వివరాలతో కూడిన లేఖలను పంపించారు.
ఈ విధానాన్నే ఇప్పుడు పలు పాఠశాలలు అనుసరిస్తున్నాయి. ఈ విషయం గురించి లారెన్ మాట్లాడుతూ పిల్లల్ని వారి తల్లిదండ్రులను అవమానించడం తమ ఉద్దేశం కాదని, అయితే కేవలం ముందుజాగ్రత్తలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇలాంటి లేఖలను పంపుతున్నామని, ఇందులో పిల్లలతోబాటు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రతలు కూడా చెబుతూ సమాచారాన్ని పంపుతున్నామని అంటున్నారు.