: విటమిన్ మాత్రలు ఇలా కూడా మేలుచేస్తాయి
విటమిన్ మాత్రలను మనం ఎక్కువగా విటమిన్ లోపాన్ని తగ్గించుకోవడానికి వాడుతుంటాం. అయితే శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో విటమిన్`బి మాత్రలు పక్షవాత వ్యాధి ముప్పును తగ్గిస్తాయని తేలింది. చైనాలోని ఝెంగ్ ఝా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో విటమిన్-బి టాబ్లెట్లు పక్షవాతం ముప్పును తగ్గించడంలో చక్కగా తోడ్పడుతున్నట్టు తేలింది.
తమ అధ్యయనంలో భాగంగా వీరు సుమారు 54,913 మంది వాలంటీర్లపై పరిశోధనలు సాగించారు. వీటిలో 14 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను విశ్లేషించారు. వీటన్నింటిలోనూ విటమిన్-బి తీసుకున్న వారిని, ఎలాంటి మందులేని మాత్రలను తీసుకున్న వారితో పోల్చిచూశారు. ఇలా ఆరునెలల పాటు వీరిని పరిశీలించారు. ఈ వాలంటీర్లలో పక్షవాతం ముప్పును నివారించే విషయంలో విటమిన్-బి తో ప్రయోజనాలున్నట్టు తేలింది. గతంలో నిర్వహించిన పలు అధ్యయనాలకు భిన్నంగా విటమిన్-బి పక్షవాతం ముప్పును ఏడుశాతం దాకా తగ్గించినట్టు ఈ అధ్యయనంలో పాల్గొన్న క్సు యామింగ్ చెబుతున్నారు. అయితే ఇది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని యామింగ్ చెబుతున్నారు.