: నాలుక ఎలా కదులుతుందంటే...
మన నాలుక మాట్లాడే సమయంలో ఎలా కదులుతుంది... ఇది మనకు పెద్దగా తెలియదు. పాతకాలం నుండి ఒక సామెత ఉంది... నోట్లో నాలుకలా ఉండాలని... అంటే నాలుక అన్ని పదునైన పళ్లమధ్య ఉన్నా కూడా చక్కగా ఏ పంటికిందా పడకుండా చకచకా మాటలు మాట్లాడేస్తుంది. అంతటి నైపుణ్యం కలిగివుంటుందన్నమాట. అందుకే పెద్దవాళ్లు అలాంటి సామెత చెప్పారు. అయితే నాలుక మాట్లాడే సమయంలో ఎలా కదులుతుంది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. మాట్లాడే సమయంలో నాలుకకు సంబంధించిన త్రీడీ చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాల్లో మాట్లాడే సమయంలో నాలుక ఎలా కదులుతుంది, అలాగే స్వరపేటిక పనితీరు ఎలా ఉంటుంది? అనే విషయాన్ని గమనించవచ్చు. ఈ చిత్రాలను, స్వరపేటికకు సంబంధించిన వివరాలను సీయింగ్ స్పీచ్ అనే వెబ్సైట్లో పొందుపరచారు. ఈ మొత్తం వివరాలు మాట్లాడేటప్పుడు మన నాలుక, స్వరపేటికలో జరిగే మార్పులను గురించి మరింతగా అర్థంచేసుకోవడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.