: 93 లక్షల రికార్డు వేతనంతో సంచలనం సృష్టించిన డీటీయూ విద్యార్ధి
గూగుల్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో రికార్డు వేతనంతో ఉద్యోగం సంపాదించి సంచలనం సృష్టించాడు హిమాంశు జిందాల్. ఢిల్లీ టెక్నోలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ)కి చెందిన కంప్యూటర్ ఇంజినీరింగ్ విద్యార్ధి హిమాంశు జిందాల్ అమెరికాలోని గూగుల్ సంస్థలో (లక్షా పదిహెను వేల డాలర్లు) 93 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. అతనితోపాటు నిఖిలేష్ అగర్వాల్ అనే విద్యార్థి 70 లక్షల రూపాయల వేతనంతో అమెరికాలోని ఎపిక్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు.
40 కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా 256 మంది మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు సంపాదించారు. వారిలో అత్యుత్తమ వేతనంతో కూడిన ఉద్యోగాన్ని హిమాంశు జిందాల్ సాధించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ప్రపంచంలో అత్యుత్తమ సంస్థలో అత్యున్నత వేతనంతో ఉద్యోగం రావడం తన కృషికి దక్కిన ప్రతిఫలమని జిందాల్ వ్యాఖ్యానించాడు. తన తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల దీవెనలే తననీ స్థాయికి తీసుకోచ్చాయని అన్నాడు.