: ఈ మ్యాప్ ప్రమాదకర ప్రాంతాలేవో చెబుతుంది
పర్యావరణానికి సంబంధించి ఏ ప్రాంతాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో... ఏవి తక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయో తెలియజేసే ఒక ప్రత్యేకమైన మ్యాప్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాలు వాతావరణ మార్పుల కారణంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఏ ప్రాంతాలు ఇలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి? అనే విషయం గుర్తించడం చాలా కష్టం. అదే తెలిస్తే పలు దేశాలకు పర్యావరణ నిధులను ఖర్చు పెట్టడం తేలికవుతుంది. పలు దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు కేటాయించే నిధులు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. దీనికితోడు ఏ ప్రాంతాలు పర్యావరణ ప్రమాదానికి లోనవుతాయి? అనే విషయం సరిగ్గా తెలియని కారణంగా నిధులు దుర్వినియోగం అవుతుంటాయి. ఇకపై తాము రూపొందించిన ప్రత్యేకమైన మ్యాప్‌తో ఏ ప్రాంతాలు పర్యావరణ ప్రమాదానికి గురవుతున్నాయో చక్కగా తెలుసుకుని ఆ ప్రాంతాల్లో ఖర్చుచేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రభావానికి లోనయ్యే పలు ప్రాంతాలు, వాతావరణ మార్పుల వల్ల వాటిపై కలిగే ప్రభావం వంటి పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించుకుని ఒక ప్రత్యేక మ్యాప్‌ను రూపొందించారు. ఈ మ్యాప్‌లో వాతావరణ మార్పుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలతోబాటు తక్కువ ముప్పును ఎదుర్కొనే ప్రాంతాలకు సంబంధించిన వివరాలను పొందుపరచారు. ఇందులో వాతావరణ మార్పుల కారణంగా అధిక ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాల జాబితాలో ముందుగా దక్షిణాసియా ఉంది. ఈ సరికొత్త మ్యాప్ పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన నిధులను ఎక్కడ ఖర్చుపెట్టాలి, ఎలాంటి చర్యలను తీసుకోవాలి? అన్న విషయాలపై ప్రభుత్వాలు, పర్యావరణ సంస్థలకు ఈ మ్యాప్ చక్కటి మార్గసూచిగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జాబితాలో దక్షిణ, ఆగ్నేయ ఆసియా, పశ్చిమ, మధ్య ఐరోపా, తూర్పు, దక్షిణ అమెరికా, దక్షిణ ఆష్ట్రేలియా ప్రాంతలు ఎక్కువ పర్యావరణ ప్రభావానికి గురవుతున్నట్టుగా పేర్కొన్నారు. ఈ మ్యాప్ రూపకల్పనకు వీరు ప్రపంచంలోని పర్యావరణ వ్యవస్థల వివరాలను, వాతావరణ మార్పుల వల్ల వాటిపై కలిగే ప్రభావానికి సంబంధించి కట్టిన అంచాల డేటాను శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు. ఈ మ్యాప్‌ను గురించి ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జేమ్స్ వాట్సన్ మాట్లాడుతూ పర్యావరణ నిధులు పరిమితంగా ఉంటాయని, వాటిని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, తాము రూపొందించిన ఈ మ్యాప్ సంక్లిష్టమైన అంశాలపై నిర్ణయాలను తీసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తుందని చెబుతున్నారు.