: ఫోనులు యజమానిని గుర్తిస్తాయి...!
ఒక ఫోను తనను ఉపయోగించే యజమానిని గుర్తించి, అతనికి మాత్రమే సమాధానం చెబితే ఎలా ఉంటుంది... ఆశ్యర్యంగా ఉంటుంది కదూ. ఇప్పుడు అలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఈ పరిజ్ఞానంతో ఫోన్లు తమ యజమాని ఎవరో ఇట్టే గుర్తించి వారికి మాత్రమే ఓపెన్ అవుతాయట. సాధారణంగా ఫోన్లు, ట్యాబ్లెట్లు వంటివాటికి పాస్వర్డ్లు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే, మన వస్తువులను ఇతరులు వాడుకునే అవకాశం లేకుండా చేయడం కోసం పాస్వర్డ్ తప్పనిసరి. అయితే ఈ పాస్వర్డ్ పొరబాటున ఎవరైనా తెలుసుకుంటే మన సమాచారాన్ని వారు గ్రహించే ప్రమాదం కూడా ఉంది. అలాకాకుండా పాస్‌వర్డ్‌తో పనిలేకుండా ఒక ప్రత్యేక విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధానంలో మన ఫోన్‌ను తట్టడం లేదా గీకడం చేస్తే చాలట. మీ ఫోనును ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తోంది మీరా? కాదా? అనే విషయాన్ని మీ ఫోన్ ఇట్టే గుర్తు పట్టేస్తుందట.
ఇలినాయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన చెంగ్బో నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సైలెంట్సెన్స్ అనే ఒక కొత్తరకం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీన్ని మీ స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ఇక మీ ఫోన్‌కు పాస్వర్డ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని దీని రూపకర్తలు చెబుతున్నారు. మీ ఫోను టచ్‌స్క్రీన్‌ను తట్టడం లేదా గీకడం చేస్తే ఫోన్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది మీరా? కాదా? అనే విషయాన్ని మీ ఫోన్ ఇట్టే గుర్తించేస్తుందట. ఇలా చేసే సమయంలో చేతివేలి సైజు, ఒత్తిడి, వేగం, గీకే విధానం వంటి అనేక వివరాలను ఇది ఫోన్లో అమర్చిన సెన్సర్ల ద్వారా అతివేగంగా అంచనా వేస్తుందట. ఫోన్ తెరిచేందుకు ప్రయత్నిస్తున్నది వేరే వ్యక్తులని అనిపిస్తే వెంటనే లాక్ పడిపోతుందట. సాధారణంగా మూడు లేదా ఐదు సార్లు తట్టినా, లేదా ఒకసారి గీకినా చాలు ఇది తన యజమానిని గుర్తిస్తుందట. ఆటలు ఆడుకునేటప్పుడు తప్ప ఈ`మెయిళ్లు, ఎస్సెమ్మెస్సులు చేయడం వంటి సందర్భాల్లో ఇది ఆటోమెటిక్‌గా అప్రమత్తం అయిపోతుందని దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.