: సౌరమండలాన్ని దాటేశాం


మానవుడు తలచుకుంటే అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడని శాస్త్రవేత్తలు ఋజువు చేశారు. ఇప్పటివరకూ సౌరమండలాన్ని అధిగమించిన జాడలు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి లేవు. ఇప్పుడు తాజాగా సౌరమండలాన్ని దాటి మానవ నిర్మిత వ్యోమనౌక ముందుకు దూసుకుపోతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన వాయేజర్‌-1 వ్యోమనౌక అంతరిక్షంలో అనంత దూరానికి సాగిపోయింది. ఈ విషయం గురించి వాయేజర్‌ ప్రాజెక్టు శాస్త్రవేత్త ఎడ్‌ స్టోన్‌ మాట్లాడుతూ వాయేజర్‌ నుండి తమకు కీలకమైన డేటా కొత్తగా అందిందని, ఇది తారాంతర భాగంలోకి మానవాళి వేసిన చారిత్రాత్మక అడుగని అన్నారు.

అంతరిక్షంలో అధ్యయనంకోసం నాసా 1977లో వాయేజర్‌-1ని ప్రయోగించింది. అనంతరం 16 రోజుల తర్వాత వాయేజర్‌-2ని కూడా అంతరిక్షంలోకి పంపారు. అయితే వీటిలో వాయేజర్‌-1 గ్రహాలన్నింటినీ దాటుకుని సౌరకుటుంబం అంచుల్లోకి వెళ్లింది. సౌరకుటుంబం దాటగానే వచ్చే సంధి ప్రదేశంలోకి వాయేజర్‌-1 ప్రవేశించింది. ఆ ప్రాంతంలో కొంత సూర్యుడి ప్రభావం ఉందని, అయితే సౌరప్రభావం ఏమాత్రం లేని ప్రాంతానికి ఎప్పుడు వెళుతుందో చెప్పలేమని స్టోన్‌ చెబుతున్నారు. వాయేజర్‌ వ్యోమనౌక 2004లో తొలిసారిగా తారాంతర ప్రదేశానికి సంబంధించిన అధిక పీడనాన్ని గుర్తించింది. అప్పటినుండి అది తారాంతర ప్రదేశంలోకి ప్రవేశించింది అనడానికి తగిన ఆధారాలను సేకరించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అందులో ప్లాస్మా సెన్సర్‌ లేదు. గత ఏడాది మార్చిలో సూర్యుడినుండి భారీస్థాయిలో వెలువడ్డ సౌరగాలులు, అయస్కాంత క్షేత్రాలు శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడ్డాయి. ఇవి పదమూడు నెలల తర్వాత ఈ ఏడాది వాయేజర్‌-1 ఉన్న ప్రాంతానికి చేరాయి. దీంతో వీణ తీగ కంపించినట్టు వ్యోమనౌక కంపించింది. ఈ ప్రకంపనల ఆధారంగా ప్లాస్మా సాంద్రతను శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వ్యోమనౌక సౌరకుటుంబం అవతల ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News