: ఇది కంగారుపడాల్సిన విషయం!
ఒకవైపు ఆహార ధాన్యాల కొరతతో ప్రపంచంలోని పలు దేశాలు సతమతమవుతుంటే... ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారధాన్యాల్లో మూడువంతుల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయట. ఇది ఉత్తినే ఎవరో చెప్పడం కాదు... అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజా నివేదికలో వెల్లడించిన వివరాలు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహార ధాన్యాల్లో మూడు వంతుల ఆహారం వృథా అవుతోందని, దీనివల్ల అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థకు ఏడాదికి సుమారుగా రూ.48.75 లక్షల కోట్లు నష్టం వాటిల్లుతోందని ఎఫ్‌ఏఓ తాజా నివేదికలో పేర్కొంది. ఒకవైపు పలు చిన్న, పేద దేశాలు ఆహార కొరతతో అల్లాడుతుంటే మరోవైపు అగ్రదేశాల్లో ఆహారం ఇలా వృథా అవుతోంది. ఇది నిజంగా కంగారుపడాల్సిన విషయమే!
బుధవారం నాడు ఎఫ్‌ఏఓ డైరెక్టర్ జనరల్ జోన్ గ్రజియానో డసిల్వా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా సుమారు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోందని, చైనా సహా ఆసియా ప్రాంతంలో ఇది మరీ ఎక్కువగా ఉందని డసిల్వా తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఆహారంలో మూడవ వంతు కోల్పోవడం లేదా వృథా అవడం జరుగుతోందని, ఇది స్విట్జర్లాండ్ జీడీపీతో సమానంగా ఉందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమ అధిపతి అచిం స్టీనర్ మాట్లాడుతూ ఇది నిజంగా కంగారుపడాల్సిన విషయమని అన్నారు.