: విభజనపై ఓ తండ్రిలా నిర్ణయం తీసుకోమన్నాం: వైఎస్ విజయమ్మ
రాష్ట్ర విభజనకు సంబంధించి తమ పార్టీ వైఖరి అప్పుడు, ఇప్పుడు ఒకటేనంటూ వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. ఈసారి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు లేఖ రాసిన ఆమె.. విభజనపై ఓ తండ్రిలా నిర్ణయం తీసుకోమన్నామని పేర్కొన్నారు. అది కూడా రెండు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పామన్నారు. రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాత సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్న షిండే వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఖండించారు. విభజనకు వైఎస్సార్సీపీ, సీపీఎం పార్టీలు వ్యతిరేకమన్నారు. అలాగే తమ పార్టీ వైఖరిని వక్రీకరించడం దురదృష్టకరమని, అనేకసార్లు తమ వైఖరిని స్పష్టం చేశామన్నారు. విభజన ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు, ఆందోళనలు, సమ్మెలను ప్రస్తావించిన విజయమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ఆపి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.