: 'ఊసరవెల్లి' డ్రస్‌లు రానున్నాయి
పాతాళభైరవి సినిమాలో ఒక దుప్పటి కప్పుకుంటే హీరో మాయం అయిపోతాడు... గుర్తుందా... సరిగ్గా అలాంటి ఒక పొరను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ పొర మాయం చేయదుగానీ... కళ్లకేకాదు... కెమెరా కళ్లకు కూడా కనిపించకుండా మాత్రం చేస్తుందంటున్నారు. అంటే మన కళ్లను, కెమెరా కళ్లను మభ్యపెడుతుందన్నమాట. అలాంటి సరికొత్త పొరను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఈ పొరతో భవిష్యత్తులో రంగును, రూపాన్ని కూడా మార్చుకునేలా సరికొత్త డ్రస్‌లను తయారుచేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలకు కూడా చిక్కకుండా అదృశ్యంగా ఉంచగలిగే ఒక ప్రత్యేకమైన పొరను రూపొందించారు. ఈ పొరను పెన్సిల్ స్క్విడ్స్‌గా పేరొందిన లోలిగినిడేల ప్రేరణతో ఈ బయోమిమెటిక్ ఇన్‌ఫ్రారెడ్ పొరను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ పరిశోధకుల బృందానికి అలన్ గెరోడెట్స్కీ నేతృత్వం వహించారు. సముద్రంలో ఉండే స్వ్కిడ్లు రంగు మార్చుకోవడంలో, వెలుతురులో మెరిసేందుకు తోడ్పడే ప్రోటీన్ ప్రేరణతో ఈ ప్రత్యేకమైన పొరకు సంబంధించిన పదార్ధాన్ని ఉత్పత్తి చేశారు. ఇది ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో చూసినప్పుడు కనిపించకుండా చేస్తుంది. దీంతో పలు వస్తువులను మభ్యపరిచేలా ఈ పొరతో కూడిన సామర్ధ్యం సొంతమవుతుందని అలన్ చెబుతున్నారు. ఈ పొరను పలు రంగాల్లో విస్తృత అవసరాలకోసం ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో రంగును, నిర్మాణాన్ని మార్చుకోగలిగే వస్త్రాలను రూపొందించడమే తమ దీర్ఘకాల లక్ష్యమని అలన్ చెబుతున్నారు.