: జాతీయ జెండాను అవమానించడంపై బీసీసీఐకి సుప్రీం నోటీసులు
టీమిండియా ఆడిన మ్యాచ్ ల సందర్భంగా జాతీయ జెండా అవమానానికి గురైందంటూ దాఖలైన పిటిషన్ పై వివరణ తెలియజేయాలంటూ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషినర్ కమల్ దే జాతీయ పతాకం కోడ్ ఉల్లంఘనపై లోగడ కలకత్తా హైకోర్టుకు వెళ్లగా.. అక్కడ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ కమల్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది.
క్రికెట్ ఫ్యాన్స్ జాతీయజెండాను తలపాగా, చేతి రుమాలుగా వాడుతూ అవమానకరంగా వ్యవహించారని కమల్ తన పిటిషన్ లో కోర్టుకు తెలిపారు. గతేడాది డిసెంబర్ లో కోల్ కతాలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ లో, ఈ ఏడాది జనవరి 3న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో ప్రేక్షకులు ఇలాగే వ్యవహరించారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన సమర్పించారు.